ప్రేమయే జనన మరణ లీల

శ్రీ శ్రీ గారు సినిమాలకు రాసిన మొదటి పాట

ప్రేమయే జనన మరణ లీల
మృత్యుపాశమే అమరబంధమౌ
యువప్రాణుల మ్రోల ||

ఆకాశమె చేరువయై తోచె
అలలే పొంగి హాయిగ వీచె
జీవితమంతా ఒకే పాటగా
ఎప్పటికీ మనమే ||

మధుర మధురతరమైన వాంఛలే
హృదయ సదనమున పరిపాలించె
సుకృతజన్మము మాదే సఫలం
సుఖమే ఏ వేళ ||

తను సాంగత్యము త్రుటియేకాదా
నిలుచు దృఢముగా మానసగాధ
మృత్యుపాశమే అమరబంధమౌ
యువప్రాణుల మ్రోల ||

         - “ఆహుతి” చిత్రం నుంచి
     

మే 8, 2008. శ్రీ శ్రీ. 1 comment.

పండమ్మ పండు!

పండమ్మ పండు!
ఏమి పండు? మామిడి పండు
ఏమి మామిడి? ముంత మామిడి
ఏమి ముంత? ఆముదం ముంత
ఏమి ఆముదం? వంట ఆముదం
ఏమి వంట? పిండి వంట
ఏమి పిండి? సున్నిపిండి
ఏమి సున్ని? మినప సున్ని
ఏమి మినప? పెద్ద మినప
ఏమి పెద్ద? బడి పెద్ద
ఏమి బడి? వీధి బడి
ఏమి వీధి? సంత వీధి
ఏమి సంత? గొడ్ల సంత
ఏమి గొడ్లు? బర్రె గొడ్లు

మే 8, 2008. తొక్కు పలుకులు, మన పిల్లల పాటలు. మీ ఉద్దేశ్యం….

ఆకులో ఆకునై పూవులో పూవునై

ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
  ఈ యడవి దాగిపోనా
             ఎట్లైనా
  నిచటనే యాగిపోనా?

 గల గలని వీచు చిరుగాలిలో కెరటమై
 జల జలని పారు సెలపాటలో తేటనై
  ఈ యడవి దాగిపోనా
            ఎట్లైనా
 నిచటనే యాగిపోనా?
 పగడాల చిగురాకు తెరచాటు తేటినై
 పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
   ఈ యడవి దాగిపోనా
            ఎట్లైనా
  నిచటనే యాగిపోనా?
 తరు లెక్కి యల నీలి గిరినెక్కి మెలమెల్ల
 చద లెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
   ఈ యడవి దాగిపోనా
            ఎట్లైనా
   నిచటనే యాగిపోనా?  
  ఆకలా దాహమా చింతలా వంతలా
  ఈ కరణి వెర్రినై యేకతమా తిరుగాడ
   ఈ యడవి దాగిపోనా
            ఎట్లైనా
   నిచటనే యాగిపోనా

                  “మేఘసందేశం” చిత్రం నుంచి

మే 7, 2008. దేవులపల్లి కృష్ణశాస. మీ ఉద్దేశ్యం….

నీచగుణములెల్ల నిర్మూలమైపోవు

నీచగుణములెల్ల నిర్మూలమైపోవు
కొదువ లేదు సుజన గొష్ఠి వలన
గంధమలదమేమి కంపడగినయట్లు
విశ్వధాభిరామ వినురవేమ

భావము:

సజ్జనులతో సాంగత్యము వలన,వారితో సంభాషించడము వలన మనలోని దుర్గుణములు తొలగిపోతాయి.మంచి వారితో కలిసి మెలసి తిరగడము వంటికి గంధము పూసుకోవడము వంటిది. శరీరములోని దుర్గంధాన్ని మంచి గంధము పూత యెలా దూరము చెస్తుందో , అలాగే సజ్జన సాంగత్యము మనలోని అవలక్షణాలని దూరము చేస్తుందని ఈ పద్య భావము.

మే 7, 2008. వేమన పద్యాలు. మీ ఉద్దేశ్యం….

నా హృదయమందు

నా హృదయమందు … 

నా హృదయమందు … 
నా హృదయమందు విశ్వవీణాగళమ్ము
భోరుభోరున నీనాడు మ్రోతవెట్టు;

దశదిశాతంత్రులొక్క సుధాశ్రుతిని బె
నంగి చుక్కలమెట్లపై వంగి వంగి
నిలిచి నిలిచి నృత్యోత్సవమ్ముల చలించు.

వెలుగులో యమృతాలొ తావులొ మరేవొ
కురియు జడులు జడులు గాగ, పొరలి పారు
కాలువలుగాగ, పూర్ణకల్లోలములుగ;
కలదు నాలోన క్షీరసాగరము నేడు!

దారిదొరకని నా గళద్వారసీమ
తరగహస్తాల పిలుపుతొందర విదల్చు!
మోయలేనింక లోకాలతీయదనము!
ఆలపింతు నానందతేజోంబునిధుల!

ప్రేయసి! చలియింపని నీ
చేయి చేయి కీలింపుము
చలియించెడు నా కంఠము
నిలిచి నిలిచి పాడగా!

ఊర్వశి! ఊర్వశి! నాతో
ఊహాపర్ణాంచలముల
వెర పెరుగని కను మూయుము!
తిరుగురాని దొరకబోని
శీతాచల శిఖరోజ్వల
హిమపీఠాగ్రమున కెగసి
శిరములెత్తి కరములెత్తి
కురియింతమొ, వినిపింతమొ,
మేలుకొనిన శ్రుతులనంత
కాలమె వికసించి వినగ,
గంగా పవిత్రకాంతుల!
యమునా శీతలమధువుల!

             “ఊర్వశి” నుంచి

మే 1, 2008. దేవులపల్లి కృష్ణశాస. మీ ఉద్దేశ్యం….

తరువాతి కాగితం »