మున్నుడి
మున్నుడి
ఈ సంపుటిలో వన్నీ గేయాలు.కృష్ణశాస్త్రిగారి గేయాలు.గేయాలు అంతే పాడదగినవి, లేక పాడవలిసినవి.కృష్ణశాస్త్రిగారిని గురించి తెలిసున్న ప్రతి ఒక్కరూ ఈ సంపుటిలోని గేయాలలో కొన్నిటినో, అన్నింటినో ఎవరో ఒకరు పాడగా వినే ఉంటారు. పాటలుగా వింటే తప్ప వీటిలోని అంద చందాలు పూర్తిగా అవగాహన కావు.
వీటిని ఖండ కావ్యాలుగా చదువుకోవచ్చు.వీటిలోని కవితా మాధుర్యాన్ని, పలుకుబడులలోని వైచిత్రిని, పదచిత్రాల వైశిష్ట్యాన్ని, భావ సౌకుమార్యాన్ని మెచ్చుకోవచ్చు. అయితే ఇవి చదువుతున్నప్పుడే వీటిలో అంతర్భూతంగా ఏదో సంగీతం ఉందనిపిస్తుంది;పాడుకోవాలనిపిస్తుంది. గొప్ప వాగ్గేయకారుల రచనల ప్రత్యేక లక్షణం అది.
అన్నమయ్య, త్యాగయ్య, క్షేత్రయ్య వంటి వాగ్గేయకారుల * లో కవితా శిల్పం కన్నా, గాన శిల్పానికి ప్రాధాన్యం ఎక్కువ. అన్నమయ్య, త్యాగయ్య కృతులను చదువుతున్నప్పుడు వాటిలో కొన్ని కవిత్వ దృష్ట్యా పేలవంగా అనిపించవచ్చు. పాడుతున్నప్పుడు ఆ పదాలకే మరొక పరిమాణం, మరొక లోతు, గాంభీర్యం సంక్రమిస్తుంది, హృదయాన్ని కదిపే శక్తి వస్తుంది. కృష్ణశాస్త్రి గేయాలు అన్నీ తీర్చి దిద్దిన ఖండకావ్యాలు. వాటిలో కవితా శిల్పం కొరవడదు. ఊరికే చదివినా పేలవంగా అనిపించవు.
కృష్ణశాస్త్రి గాయకుడు కాడు. కాని గొప్ప వాగ్గేయకారుల లక్షణం ఒకటి ఆయనలో ఉంది. కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి వ్రాసిన నాటికి, బ్రహ్మప్రార్ధన గీతాలు వ్రాసిననాటికి ఆయనలోని కవి మాత్రమే ప్రస్ఫుటంగా కనిపిస్తాడు. గాయకుడు అఙ్ఞాతంగా మాత్రమే ఉన్నాడు. తరువాత తరువాత, రేడియో చలనచిత్ర రంగాలతో సన్నిహిత సంబంధం ఏర్పడ్డాక, ఆయనలోని కవితో పాటు, గాయకుడు కూడా ఎంతగానో పెరిగాడు. అంతే కాదు, గాయకుడు ఆయనలోని కవిని తీర్చి దిద్దాడు కూడా.
భావకవి త్వోద్యమవు మొదటిరోజుల్లో, పాత చందస్సులను స్వస్తి చెప్పి, గేయరచనకు పూనుకుని, గేయలకు సాహిత్య గౌరవం సంపాదించిన ప్రముఖులందరినిలాగే, కృష్ణశాస్త్రి కూడా తన గేయాలకు మాత్రా చందస్సునే ప్రాతిపదికగా చేశాడు. తెనుగు జానపద రచనలలో అయిదు మాత్రల ఛందాన్ని విరివిగా వాడ్డం సంప్రదాయం.భావకవులు ఆ ఛందాన్నే ఎక్కువగా తమ గేయాలకు ఉపయోగించారు. అయిదు మాత్రల నడకకీ, తెనుగుకీ ఏదో స్వాభావికమైన అనుబంధం ఉంది. 3,4,6,7 మాత్రల ఛందాలు అక్కడక్కడ వాడినా, కృష్ణశాస్త్రి తొలి గేయాల్లో ఎక్కువ భాగం ఖండగతిలో నడిచినవే.’ఆకులో ఆకునై’ …, ‘కన్నీటి కెరటాల ‘ …, ‘శిథిలాలయమ్ములో’ మొదలైన ప్రసిద్ధ గేయాలన్నీ ఖండగతిలో వ్రాయబడ్డవే. వీటిని రాగబద్ధం చేసి, పాడి, ప్రచారం చెందుతుంది. మరికొన్ని రజని, ఒకటి రెండు బి.వి. నరసిం హారావు, ఒకటి స్థానం పాటలుగా తీర్చిదిద్దారు. సాహిత్య సమావేశాల్లో ఈ పాటలు అనసూయా సీతలో, రజనో పాడ్డం కార్యక్రమంలో భాగం అయిపోయింది. ఆ ట్యూన్లకూ ఆ పదాలకూ అవినాభావం ఏర్పడి, రచన, పాట ఒకరివే అన్నంతగా కలిసిపోయాయి.
రేడియోతో సంపర్కం ఏర్పడ్డాక, రక రకాల గాయకులతో సాన్నిహిత్యం ఎక్కువయాక, కృష్ణశాస్త్రి గేయ రచనా శిల్పంలో ఎంతో మార్పు వచ్చింది. మౌలికమైన మార్పు ! తెనుగు జానపద గేయాలలోనూ, కీర్తనలలోనూ, ముఖ్యంగా పదాలలోనూ వాగ్గేయకారులు చిత్రంగా స్వతంత్రించారు. రచన అయిదు మాత్రలదైనా, దాన్ని పాడ్డంలో 6,7 మాత్రల తాళాలకు పెంచి పాడ్డం, అందువల్ల ఆ పాటలకు చిత్రమైన కొత్తదనం రావడం కృష్ణశాస్త్రికి కనువిప్పు కలిగించింది. ఆ తరువాత ఆయన వ్రాసిన గేయాలన్నీ,(ఇంచుమించు) ఎవరో ఒక ప్రముఖ గాయకుణ్ణి – ఏ రజనినో, విశ్వానాథాన్నో, పి.బి. శ్రీనివాస్ నో – ఎదురుగా కూర్చోబెట్టుకుని, ట్యూన్ తో పాటు పదాలు బిగించి వ్రాసినవే. అయితే, ఆ రచనల వాగ్గేయ స్వరూపానికి పూర్తి బాధ్యత కృష్ణశాస్త్రిదే! ఆయన ఒక పంక్తి వ్రాసి ఇచ్చేవారు. దానికి ట్యూన్ అఙ్ఞాతంగా ఆయనలో ఏదో ఉండేది. గాయకుడు ఆ పంక్తి రక రకాల తాళాల్లో, రాగల్లో అనగా అనగా, ఆయన అనుకున్న వరస చటుకున తగిలేది. ‘ఇదీ ఈ పాటకు వరస ‘ అని ఆయన నిర్ణయించేవారు. ఆ తరువాత మిగిలిన పాదాలు మెల్ల మెల్లగా పూర్తి అయేవి – సంగీతంతో పాటు. చటుక్కుని సంగీతంలో ఒక మెలకువ, ఒక విరుపు తగిలేది. దానికి మాట దొరికేది కాదు. కాని ఆ విరుపు మార్చడానికి ఆయన ఒప్పుకునేవాడు కాడు. ‘దానిలో ఇమిడే తెలుగుపదం ఉంది – గుర్తొస్తుంది ‘ అనేవాడు. అది గుర్తు వచ్చేవరకూ పాట ఆగిపోయేది. గుర్తొచ్చిన తరువాత ‘ఆహా!’ అనిపించేది. అందువల్ల ట్యూన్ చేసినవారు ఎవరైనా, దాని ఘనతలో చాల భాగం కృష్ణశాస్త్రిదే. అందుకే ఆయన గొప్ప వాగ్గేయకారుల కోవకు చెందివాడన్నాను. అందువల్లనే ఆయన గేయాలలో ఎక్కడా వెలితి కనపడదు – సంగీతం దృష్ట్యా చూసినా, కవిత్వ దృష్ట్యా చూసినా !
ఈ సంపుటంలో తొలినాటి గేయాలూ, మలినాటి గేయాలూ కలిసిపోయాయి. విషయ సామ్యాన్ని బట్టి విభజన జరిగింది గాని, రచనలు పుట్టిన కాలాన్నిబట్టి కాదు. అయితే ఏ కాలంలో వ్రాసినా, కృష్ణశాస్త్రి ముద్ర ప్రతి గేయం మీదా ఉంటుంది.
పండితులు, విమర్శకులు ఒక కవి రచనలలోనుంచి ఏదో ఒక తాత్త్విక సూత్రాన్ని పిండడానికి ప్రయత్నించడం జరుగుతుంది. వారికి ఈ గేయ సంపుటి ఒక గడ్డుసమస్య అయిపోతుంది. ఇందులో ఎన్నో భగవానుణ్ణి ఉద్దేశించిన గేయాలున్నాయి. ఒకొక్కప్పుడు ఆయన పిలిచే భగవానుడు నిర్గుణుడు ,నిరాకారుడు ఒకొక్కప్పుడు స్పష్టమైన మూర్తితో సాక్షాత్కరించే రాముడో, కృష్ణుడో, శివుడో! అంతే కాదు. ఒకొక్క గేయానికి వెనక ఉన్న భక్తులలో కూడా ఎన్నో భేదాలున్నాయి. ఒక గేయంలో సూఫీ తత్త్వఙ్ఞుడు పరదైవతాన్ని గురించి పాడతాడు. మరొక్క గేయంలో భక్తుడు దీనుడు, దారి తెలియని చీకట్లో అల్లలాడే బాధా జీవి. ఇంకొక్క గేయంలో భగవంతుణ్ణి ఆప్యాయంగా అపహసించే సామాన్యుడు. భగవత్ స్వరూపాన్ని వివిధంగా దర్శించే రక రకాల భక్తులుగా కవి మారిపోతాడు. ఒకొక్క భక్తుడు కృష్ణశాస్త్రి ఒకొక్క అవతారం. అందువల్ల అసలు కృష్ణశాస్త్రి తాత్త్విక దృష్టి ఏదో ఎవరికీ అందదు. బెర్నార్డ్ షా ‘*’ అన్నాడు. అలాగే ఒకొక్క గేయంలోని భావావేశంలో ఒకొక్క విభిన్న మూర్తి అయిపోతాడు కృష్ణశాస్త్రి. అయిపోయి కూడా అసలు కృష్ణశాస్త్రిని స్ఫురింపచేస్తాడు. ఆయన ‘నేను మానవతావాదిని ‘ , ‘వట్టి హృదయవాదిని ‘ అని అంటుండేవాడు. అందుకే ఆయన ప్రతిగేయంలోనూ గుండె పలుకుతుంది -మనిషి గుండె – విరాట్ స్వరూపం దాల్చిన మనిషి గుండె!
- పద్మరాజు
No Comments Yet
వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!