శ్రీశ్రీ గారి ముందు మాట

                          

అమృతవీణ గేయసంహితకు శ్రీశ్రీ గారు రాసిన ముందుమాట            

                     ఆస్వాదానికి ఆహ్వానం

     ఇక్షు సముద్రం యెక్కడుందో నాకు తెలియదు. కాని, ఆపాత మధుర మయిన కృష్ణశాస్త్రి సాహిత్యం సమస్తము ఇక్షు రసార్ణవమే. కృష్ణశాస్త్రి పలుకుల్లోని చెరుకు తీపి సాహిత్య రస పిపాసువులకు ఎక్కడో వుందనుకునే ఇక్షు సముద్రాన్ని వెదుక్కోవలసిన అగత్యాన్ని తొలగిస్తుంది.

  అందుకే పురాణాల్లో పేర్కొన్న ఇక్షు సముద్రం ఎక్కడుంటుందో  దాని జాగ్రఫీ జోలికి వెళ్ళదల్చుకోను నేను. మన యెదుట నిజంగా కృష్ణశాస్త్రి సాహిత్య సమస్తమూ ఉరకలూ పరుగులుగా ఉప్పొంగుతోంది. ఇదే అసలు సిసలైన చెరుకు రసాల కడలి. ‘ఆస్వాదించుదాం రండర్రా!’ అని అందర్నీ ఆహ్వానిస్తున్నాను.
 
   ఒకప్పుడు కృష్ణశాస్త్రి కవిత్వం మాత్రమే మాధుర్య ‘మా’ధుర్యమనుకున్నాము. ఇప్పుడు మీ చేతిలో వున్న పుస్తకాన్ని చూడండి. ఇంకా అచ్హవుతున్న, లేదా అయి సిద్ధంగా వున్న సంపుటాల్ని చూడండి. అప్పుడు మాధుర్యం అంటే ఏమిటో మీకే అర్ధం అవుతుంది. అప్పుడు వాస్తవంగానే ఒక ఇక్షు సముద్రంలో మీరు ఓలలాడుతారు.

  కాని ఇక్కడో చిన్న విశేషం ఉంది. తినగ తినగ వేము తియ్యనుండు నేమో కాని, అంతా చెరుకు రసమే అయితే మొగం మొత్తేస్తుంది. అందుకే కృష్ణశాస్త్రి చెరుకు సముద్రంలో అక్కడక్కడ మిరియాల పొడి ఉంది. కరక్కాయల కసటుదనం ఉంది. ఇంకా మీరు కోరుకొనే ఎన్నెనో మసాలాలున్నయి.

  ఇప్పుడు నా మనస్సు 50 సంవత్సరాల వెనక్కి పోతోంది. 1920 ల ప్రారంభ దినాలవి. ఆ రోజుల్లోనే జమీందారీ కవిత్వాన్ని తోసి రా జని భావకవిత్వం రంగ ప్రవేశం చేసింది. 1910 – 20 ల మధ్య ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన వారు రాయప్రోలు, అబ్బూరి. అయితే దీనికి 20లలో అఖిలాంద్ర ప్రాచూర్యం ఇచ్చినవారు కృష్ణశాస్త్రి.

బరంపురం నుంచి బళ్ళారి దాకా ఈయన తనవీ, ఇతరులవీ భావగీతాల కవితాగానం చేస్తూ యువతరాన్ని ఆకట్టుకున్నాడు.

  అయితే కృష్ణశాస్త్రిది ప్రతిఘటన లేని విజయ యాత్ర కాదు. మహాపండితుడయిన అక్కిరాజు ఉమాకాంతం  “నేటి కాలపు కవిత్వం” అనే పుస్తకం రాసి, అందులో ఎక్కువభాగం కృష్ణశాస్త్రినే వెక్కిరించాడు. ఉమాకాంతం(సంస్కృతపు  స్పెల్లింగు చూడండి!)గారికి సంస్కృతంలో తప్ప మరెక్కడ కవిత్వం కనపడదు. నన్నయభట్టును కూడా ఆయన కవిగా ఖాతరు చెయ్యలేదు. నేటి కాలం కవిత్వానికి కాలం కాదనేశాడాయన.

   కాని, ప్రపంచం మాత్రం వేరు విధంగా భావించింది.భావ కవిత్వాన్ని ఆనాటి ప్రధాన శాఖగా గుర్తించింది. ఈ శాఖ ఎన్నో కోకిలలకు ఆశ్రయం ఇచ్చింది. (గౌతమీ కోకిలగా పేరు పొందిన వేదుల సత్యనారాయణ శాస్త్రిని ఇక్కడో చిన్న ఉదాహరణగా ఉటంకించవచ్చును.) ఈ అన్ని కోయిలలలో అగ్రస్థానం సాహిత్యవిమర్శకు లంతా కృష్ణశాస్త్రిదే అని అంగీకరించారు.

  “నేటి కాలపు కవిత్వం” ఇప్పుడు లైబ్రరీలలో బూజు పట్టిపోతుంది.కృష్ణశాస్త్రి కవిత్వం భావకవితకు పరాకాష్ఠగా నిలబదింది.

  అనంతపంతుల రామలింగ స్వామి అనే ఆయన “కృష్ణ పక్షం ” కావ్య సంపుటిని వేళాకోళం చేస్తున్నాననుకుంటూ “శుక్ల పక్షం” అనే రాతని వెలువరించాడు. దాన్ని కూడా ఇప్పుడు చదివే వాళ్ళెవరూ లేరు. ఆ రోజుల్లోనే దాన్ని వేదుల “ఈ శుక్ల పక్షం సారస్వ తారిష్టం  అనే శుక్ల నష్టం” అని చెప్పి సహృదయుల హృదయఫలకాల నుంచి తుడిచిపెట్టి పారేశాడు.

    1930 లలో భావకవిత్వం మీద తిరుగుబాటుగా అభ్యుదయ కవిత్వం వచ్చింది. కాలంతో పాటు ఎదుగుతున్న కృష్ణశాస్త్రి అభ్యుదయ కవిత్వాన్ని ఆహ్వానించి ఆశీర్వదించాడు. అంతే కాదు. అభ్యుదయ రచయితల సంఘం వార్షికోత్సవాలలో ఒకదానికి అధ్యక్షత  వహించాడు.

     సినిమా రంగంలో ప్రవేశించి, మళ్ళీ ఇలాటిది రావడానికి వీల్లేదన్నట్టుగా మల్లీశ్వరి రాసాడు. ఈ మధ్య కాలంలో ఆయన యెన్నో రేడియో నాటకాలు రాశాడు. రేడియో ప్రసంగాలు చేశాడు.
 
  ఆ తర్వాత ఆయన గొంతుక పోయింది. కాగితాల మీద (చిన్న చిన్న నోటుబుక్కుల మీద) అక్షరాలు రాస్తునే, తన దగ్గరకు వచ్చిన అందరితోనూ ప్రసంగించాడు. ఎన్నో ట్రంకు పెట్టెల నిండా ఈ నోటుబుక్కులున్నాయని బుజ్జాయి(కృష్ణశాస్త్రి గారి అబ్బాయి) నాతో చెప్పాడు.

  ఒకదానిలో కృష్ణశాస్త్రిగారు నా మీద ఇలా రాశారట: “శ్రీశ్రీ గొప్ప కవి.అతని మీద ఈగ వాలినా నేను సహించలేను” అని!
 
  నా మీద వారికెప్పుడూ సదభిప్రాయమే ఉంది. మరి వారి మీద నాకు వల్లమాలినంత అభిమానం. నా మనస్సు మీద చెరగని ముద్రలు వెసిన ముఖ్యాతిముఖ్యులలో కృష్ణశాస్త్రిని ప్రముఖముగా పేర్కొంటాను.
 వారి మీద నాకున్న అభిమానం , ఆపేక్ష వారి యీ గ్రంథ సంపుటాలకు గాను ఈ రాత రాయడానికి ప్రేరేపించాయి.మరో మారు చెబుతున్నాను. ఇది ఇక్షు సముద్రము. “అందరం ఆస్వాదించుదాం, రం”డని  ఆహ్వానిస్తున్నాను.

మద్రాసు,
29-11-81                                   శ్రీశ్రీ

    

No Comments Yet

వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!

ప్రత్యుత్తరమిమ్ము

Trackback URI