నా కేల ఒక జోలె

గీతము 59

నా కేల ఒక జోలె,
    నాలో అమృత వీణ
ఉంచి నను లె మ్మందువా !
          దేవ
ఊరకే పొమ్మందువా !
నాలుగూ దిక్కులా
నడిమి స్వర్గమ్ములో
ప్రతి ఇంటి మోసాల ఆగనా !
          దేవ
ప్రతి గుండె మోసాల మ్రోగనా !

పాడి పాడీ, నృత్య
మాడి ఆడీ, నిన్ను
వేడి వేడీ పొరలనా !
      ప్రతి గుండె
తోడ కూడీ తరలనా !
నాలుగూ దిక్కులా
నడిమి స్వర్గ మ్మంత
గంధర్వ సీమగా చేయనా !
         దేవ
గాన సౌధమ్ముగా చేయనా !
విరిసి విరిసీ, తేనె
కురిసి కురిసీ దెనల
దరిసి దరిసీ పొరలనా !
      ప్రతి గుండె
నొరసి యొరసీ తరలనా!
నాలుగూ దిక్కులా
నడిమి స్వర్గ మ్మంత
పూల పందిరి చేయనా !
       దేవ
బృందావనము చేయనా !

తేలి తేలీ, అలల
తూలి తూలీ, చదల
సోలి సోలీ పొరలనా !
     ప్రతి గుండె
మాల లల్లీ తరలనా !
నాలుగూ దిక్కులా
నడిమి స్వర్గ మ్మంత
పాల కదలిగ చేయనా !
       దేవ
పండు పున్నమి చేయనా !

తలపు తలపూ జ్యోతి,
పలుకు పలుకూ గీతె,
పనులన్ని ప్రణయముగ చేయనా !
        దేవ !
ప్రతి గుండె నీ గాథ పోయనా !
నాలుగూ దిక్కులా
నడిమి స్వర్గ మ్మంత
మూల మూలల నడుతునా
   నా దేవ
వేల వేలల విడుతునా !

న న్నొక్క జోలెగా,
న న్నమృత వీణగా
తడయ కిక రమ్మందువా !
      ప్రతి గుండె
విడియగా తెమ్మందువా !
నాలుగూ దిక్కులా
నడిమి స్వర్గమ్ముతో
గంగలా కడలిలో దూకనా !
     దేవ
పొంగుతూ అడుగులా తాకనా !

ఏప్రియల్ 15, 2008. దేవులపల్లి కృష్ణశాస.

No Comments Yet

వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!

ప్రత్యుత్తరమిమ్ము

Trackback URI