నా హృదయమందు
నా హృదయమందు …
నా హృదయమందు …
నా హృదయమందు విశ్వవీణాగళమ్ము
భోరుభోరున నీనాడు మ్రోతవెట్టు;
దశదిశాతంత్రులొక్క సుధాశ్రుతిని బె
నంగి చుక్కలమెట్లపై వంగి వంగి
నిలిచి నిలిచి నృత్యోత్సవమ్ముల చలించు.
వెలుగులో యమృతాలొ తావులొ మరేవొ
కురియు జడులు జడులు గాగ, పొరలి పారు
కాలువలుగాగ, పూర్ణకల్లోలములుగ;
కలదు నాలోన క్షీరసాగరము నేడు!
దారిదొరకని నా గళద్వారసీమ
తరగహస్తాల పిలుపుతొందర విదల్చు!
మోయలేనింక లోకాలతీయదనము!
ఆలపింతు నానందతేజోంబునిధుల!
ప్రేయసి! చలియింపని నీ
చేయి చేయి కీలింపుము
చలియించెడు నా కంఠము
నిలిచి నిలిచి పాడగా!
ఊర్వశి! ఊర్వశి! నాతో
ఊహాపర్ణాంచలముల
వెర పెరుగని కను మూయుము!
తిరుగురాని దొరకబోని
శీతాచల శిఖరోజ్వల
హిమపీఠాగ్రమున కెగసి
శిరములెత్తి కరములెత్తి
కురియింతమొ, వినిపింతమొ,
మేలుకొనిన శ్రుతులనంత
కాలమె వికసించి వినగ,
గంగా పవిత్రకాంతుల!
యమునా శీతలమధువుల!
“ఊర్వశి” నుంచి
No Comments Yet
వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!