ఆకులో ఆకునై పూవులో పూవునై
ఆకులో ఆకునై పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై నునులేత రెమ్మనై
ఈ యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటనే యాగిపోనా?
గల గలని వీచు చిరుగాలిలో కెరటమై
జల జలని పారు సెలపాటలో తేటనై
ఈ యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటనే యాగిపోనా?
పగడాల చిగురాకు తెరచాటు తేటినై
పరువంపు విరిచేడె చిన్నారి సిగ్గునై
ఈ యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటనే యాగిపోనా?
తరు లెక్కి యల నీలి గిరినెక్కి మెలమెల్ల
చద లెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఈ యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటనే యాగిపోనా?
ఆకలా దాహమా చింతలా వంతలా
ఈ కరణి వెర్రినై యేకతమా తిరుగాడ
ఈ యడవి దాగిపోనా
ఎట్లైనా
నిచటనే యాగిపోనా
“మేఘసందేశం” చిత్రం నుంచి
No Comments Yet
వ్యాఖ్యానించిన మొదటివారవ్వండి!